ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం

ధరణిని వద్దనే పార్టీని బంగాళాఖాతంలో వేయండి..బి ఆర్ఎస్ ను గెలిపిస్తే ఖమ్మానికి ధీటుగా పాలేరు అభివృద్ధి..డబ్బు మదంతో మాట్లాడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు..పూటకు ఒక పార్టీని మార్చే వారిని నమ్మకండి..ఖమ్మం జిల్లా పాలేరు భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్…

Written by Mohiddin Shaik

ధరణి వల్లనే రైతు బంధు తో సహా అన్ని సౌకర్యాలు రైతులకి అందుతున్నాయని దాన్ని రద్దు చేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్కు ఓటు వేస్తే రైతుబంధు , రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, తదితర రాయితీలు అన్నిటికీ ఆ పార్టీ రామ్ రామ్ పలుకుతుందని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని జీళ్ళ చెరువు గ్రామంలో శుక్రవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఆయన పేరు ప్రస్తావించకుండా, మాట్లాడుతూ కాంట్రాక్టుల పై వచ్చిన డబ్బు మదంతో కొందరు అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్నారని , ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో , ప్రజలు నిర్ణయిస్తారని ఆయన అన్నారు. పదవుల కోసం పూటకొక పార్టీని మార్చే బహురూప గాళ్లను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.

. … ఖమ్మానికి ధ్యుటుగా పాలేరు అభివృద్ధి చేస్తాం…

బిఆర్ ఎస్ అభ్యర్థిగా పాలేరు నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే ,ఖమ్మానికి ధీటుగా పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కందాల ఉపేందర్ రెడ్డి కల్మషం లేని నాయకుడని, ఆయన ప్రసంగం విన్నప్పుడు ఆయన తన ఇంటి మనుషులతో మాట్లాడుతున్నట్లు అనిపించిందని కేసీఆర్ పేర్కొన్నారు. అటువంటి నాయకుడిని తిరిగి ఎమ్మెల్యే ని చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలేరు నియోజకవర్గంలో లంబాడా తెగకు చెందినవారు అత్యధిక తండాల్లో ఉన్నారని, దాదాపు నియోజకవర్గంలో 40 లంబాడా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి , వాటికి వారినే పరిపాలకులుగా చేసిన ఘనత బీఆర్ఎస్ కి దక్కుతుందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలు నమ్మవద్దని, ప్రధానంగా రైతులు 24 గంటలు ఉచిత కరెంటు ,సమయానికి విత్తనాలు, ఎరువులు, రైతుబంధు ,పుష్కలంగా నీళ్లు అందించడంతోపాటు , ధాన్యంతో సహా పంటల కొనుగోలు కూడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని , ఇటువంటి మంచి వాతావరణాన్ని కాంగ్రెస్ దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుందని, ఎవరు కూడా ఆగం కావద్దని ఆయన కోరారు.

… తుమ్మలకు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మంత్రి పదవి ఇచ్చి గౌరవించాం…

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఓడిపోయి ఇంట్లో కూర్చుని ఉంటే ఆయనను పిలిచి మంత్రి పదవి ఇచ్చామని ,ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చామని ,ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి అవకాశం ఇచ్చి గెలిపించామని కేసీఆర్ అన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే పాలేరు నుంచి భక్త రామదాసు ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించామని కేసీఆర్ తెలిపారు. ఇన్ని అవకాశాలు ఇచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ఆయనకు ఏకచత్రాధిపత్యాన్ని అప్పజెబితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా , బి ఆర్ఎస్ ను గెలిపించలేకపోయారని కేసీఆర్ అన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసునని ఎవరికి ఎవరు అన్యాయం చేశారు ప్రజలు తెలుసుకోగలుగుతారని కెసిఆర్ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒక్కసీటే గెలిచామని, గత ఎన్నికల్లోను ఒక్కసీటే గెలిచామని అయినప్పటికీ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

…. కందాలను గెలిపిస్తే పాలేరులో దళిత బంధు అమలు చేస్తాం…

తమ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ దళిత బంధు అమలు చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి ఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో చేసి చూపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం అమలు చేస్తున్న, అభివృద్ధి , సంక్షేమ పథకాలను పెంచి మరికొన్ని జోడించి కొత్తగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో లోని వాగ్దానాలను కూడా కేసీఆర్ భారీ సంఖ్యలో హాజరైన సభికులకు వివరించారు. కార్యక్రమంలో, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , వైరా బి ఆర్ ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్, ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, ఇల్లందు అభ్యర్థి హరిప్రియ నాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

About the author

Mohiddin Shaik

Leave a Comment