ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ రాజకీయం

ప్యారాచూట్ లీడర్ల కే ప్రాధాన్యం…!జండా మోసిన నేతలు త్యాగాలకు సిద్ధం కావాల్సిందే..!వలసల జోరుతో కాంగ్రెస్లో వింత స్థితి… అధికారం పై ఆశలు ఫలిస్తాయా..?

Written by Mohiddin Shaik

రాష్ట్రవ్యాప్తంగా వలసల జోరు కాంగ్రెస్లో అధికారం పై ఆశలు రేకిత్తిస్తోంది… ప్యారాచూట్ లీడర్లతో కాంగ్రెస్కు అధికారం అంది వస్తుందా..!
లేక వారి దెబ్బకు నిజమైన సైనికుల్లాంటి క్యాడర్ ఆ పార్టీకి దూరమవుతుందా..? ఈ ప్రశ్నలు ఆ పార్టీలో అనేకమంది పెద్దలను వేధిస్తున్నాయి… వలస లీడర్లకు పెద్ద సంఖ్యలోనే టిక్కెట్లు కేటాయిస్తారని చర్చ జరుగుతుంది.. అలా కేటాయించకుండా ఉండలేని పరిస్థితికి వలసలు కాంగ్రెస్ అధిష్టానాన్ని నెట్టివేశాయి.. వచ్చిన లీడర్లు దమ్మున్న వారు.. ఒక్క మాటలో చెప్పాలంటే గెలుపు గుర్రాలు.. మరి వారిని కాంగ్రెస్ ఎలా వదులుకుంటుంది..? వారిలో ముఖ్యమైన నాయకులు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, మైనంపల్లి హనుమంతరావు, ఇలా ప్రజాదరణ కలిగిన అనేకమంది కాంగ్రెస్ లో చేరినప్పుడు సహజంగానే వారికి టిక్కెట్లు కేటాయించక తప్పదు… అయితే మరి ఆయా స్థానాల్లో పార్టీ అధికారంలో లేకపోయినా ,అనేక ప్రయాసల కు ఓర్చి జెండా కింద పడకుండా భుజాలపై మోసిన నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురికాక తప్పదు… ఆవేదన చెందకుండా ఉండలేరు ..ఈ అంశం లోనే ఎక్కడైనా నిజమైన సైనికులాంటి కార్యకర్తలు పార్టీకి దూరమవుతారేమో అని అనుమానాలు ఆ పార్టీ సీనియర్ నాయకుల్లో వ్యక్తం అవుతున్నాయి…

…. ఉన్న జనరల్ స్థానాలు వలస లీడర్లకి ఇస్తే ఎలా..?

ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నవి మూడే మూడు జనరల్ స్థానాలు. వాటిలో ఖమ్మం జిల్లాలో రెండు ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒకే ఒక్క స్థానం ఉంది. కాగా ఖమ్మంలోని పాలేరు ఖమ్మం ఈ రెండు స్థానాల్లో కొత్తగా కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లకు పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ కల్పిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూడా వలస వచ్చిన నాయకుల్లో ఎవరికో ఒకరికి కేటాయించవచ్చని ప్రచారం జరుగుతుంది ఒకవేళ కమ్యూనిస్టులతో అవగాహన కుదిరితే సిపిఐకి కేటాయిస్తారని చర్చ కూడా ఉంది. అంటే ఉన్న జనరల్ స్థానాల్లో వలస వచ్చిన లీడర్లకే అగ్రతాంబూలం అందిస్తే ఇప్పటివరకు ఆ జెండాని నమ్ముకుని ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దశాబ్దాలుగా పనిచేసే కాంగ్రెస్ నాయకులు ఆయా స్థానాలను ఇప్పటివరకు తమకు దక్కుతుందని ఆశించిన వారు తీవ్ర ఆవేదనకు లోను కావడం సహజం. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది నుంచి 15 చోట్ల ఏర్పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు

దాదాపు పది నుంచి 15 నియోజకవర్గాల పరిధిలో కొత్తగా అధికార పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులకు కాంగ్రెస్ టికెట్లు కేటాయించబోతోందని చర్చ జరుగుతోంది. ఆయా స్థానాల్లో నిజమైన కాంగ్రెస్ కేడర్ దెబ్బ తినకుండా చూసుకోవడం కాంగ్రెస్ అధినాయకత్వానికి ఒక పెద్ద సవాలుగా మారనుందని పరిశీలకులు అంటున్నారు.
… సర్వేలకు ప్రాధాన్యతను ఇస్తారా …కొత్త వారి హామీలు నెరవేర్చుతారా..
కాంగ్రెస్ పార్టీవ్యూహ కర్త సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేకు ప్రాధాన్యతనిచ్చి సీట్ల కేటాయింపు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సందర్భంలో కొత్తగా పార్టీలో చేరిన కొంతమంది నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, అధిష్టానం ఇచ్చిన హామీకి కట్టుబడి సీట్ల కేటాయింపు జరుగుతుందని చర్చ కూడా జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్వ వ్యూ హా త్మకంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఖమ్మం నుంచి రంగంలోకి దించబోతోందని తెలుస్తోంది. ఆయన పాలేరు నియోజకవర్గ కేటాయించాలని కోరినప్పటికీ రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఒప్పించి పోటీకి దించుతోందని అంటున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి పై పోటీకి దించుతున్నట్లు తెలుస్తోంది.

అక్కడ రెడ్డి పై రెడ్డిని పోటీకి దించి ఖమ్మంలో చౌదరిపై మరో చౌదరి ముఖ్య నాయకుడిని దించడం ద్వారా కాంగ్రెస్ విజయం సాధించాలని లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇక సత్తుపల్లి నుంచి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ మట్ట దయానంద్ సతీమణి రాగమయికి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. వైరా నియోజకవర్గంలో నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర వర్గంలో ఉన్న మహిళ నాయకురాలు కి సీటు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మధిర నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండగా భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోదాం వీరయ్య రంగంలో నిలవనున్నారు. పినపాక నియోజకవర్గం నుంచి పొంగులేటి అనుచరుడు పాయం వెంకటేశ్వర్లకు అవకాశం కల్పిస్తారని చర్చ జరుగుతోంది. ఇల్లందు నియోజకవర్గంలో నుంచి కోరం కనకయ్యకు అవకాశం లభించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇలా చూసినప్పుడు ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికే కాంగ్రెస్ అవకాశం ఇస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. .

…. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ కూడా వలసలతోనే ఎదిగింది…

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన వలసల పరిస్థితి గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో ఉండేది. టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న సమయంలోనే మాజీ మంత్రి టిడిపి నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంకా అనేకమంది నాయకులు టిఆర్ఎస్ లో చేరారు. కొన్నాళ్ల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. మరికొంత కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ అదేవిధంగా అనేకమంది కార్యకర్తలు రెండవ శ్రేణి నాయకులు టిఆర్ఎస్ లో చేరారు. ఆ తరువాతనే ఖమ్మం కార్పొరేషన్ గెలుచుకోవడం , స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుచుకోవడం, ఆ తరువాత స్థానిక సంస్థలు ఇలా అనేక ఎన్నికల్లో విజయాలు నమోదు చేసుకుంటూ ఆ పార్టీ ఎదిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలో తలెత్తిన వర్గ విభేదాలు వల్ల ఒకే ఒక స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ టిఆర్ఎస్ తరఫున గెలిచారు. ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పక్షాన గెలిచిన శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా గులాబీ కండువా కప్పుకునేలా చేశారు. ఇప్పుడు వలసనేతల దూకుడు కాంగ్రెస్ లోకి కొనసాగుతోంది వచ్చే ఎన్నికల్లో గుమ్మడి ఖమ్మం జిల్లాలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ వలసనేతలకే కేటాయించబోతుందని ప్రచారం జరుగుతుంది. అలా కేటాయించడం వల్ల కాంగ్రెస్కు మేలు జరుగుతుందని పరిశీలకులు చెబుతుండగా అదే సందర్భంలో ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడిన నాయకులు పార్టీకి దూరమవుతారేమో అని చర్చ కూడా మరోవైపు కొనసాగుతోంది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్న వలసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అనే ఆశలు ఆ పార్టీ నేతల్లో కల్పిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారా , లేక మరొకసారి కారు పార్టీకి జై కొడతారా, వేచి చూడాల్సిందే.
…..

About the author

Mohiddin Shaik

Leave a Comment