ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు తెలంగాణ

బాబు కోసం భారీ ప్రదర్శనలు…పార్టీలకు అతీతంగా అభిమానుల ర్యాలీ.. చంద్రబాబును విడుదల చేయాలంటూ నినాదాలు..

Written by Mohiddin Shaik

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని నినాదాలు చేస్తూ పలుచోట్ల భారీ ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఆదివారం అనేకమంది మహిళలు వీధిలోకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ ఆ అరెస్టును ఖండిస్తున్నట్లు వారు నినదించారు. ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగకుండా జైలు నుండి విడుదల చేయాలంటూ వారు నినాదాలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడుతో అనుబంధం ఉన్నవాళ్లు అభిమానించేవారు అనేకమంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు

ప్రధానంగా ఖమ్మం జిల్లాలో జరిగిన ర్యాలీ అగ్రభాగాన బి ఆర్ ఎస్ నాయకులు అనేకమంది నడిచారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రైతుబంధు కమిటీ జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు తో సహా అనేకమంది ప్రస్తుతం బి ఆర్ఎస్ లో పనిచేస్తున్న నాయకులు ఈ ర్యాలీలో కనిపించారు. ఇదిలా ఉంటే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించటమే కాకుండా ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఆదివారం జరిగిన భారీ ర్యాలీకి సంబంధించి పలువురు ఈ ర్యాలీలో గులాబీ పార్టీ నాయకులు పాల్గొనడం పై పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. పార్టీ వేరైనప్పటికీ తెలుగుదేశం శ్రేణులతో పాటు వేరే పార్టీలో ఉన్న గులాబీ నేతలు సైతం గొంతు కలిపి నిరసనలో పాల్గొనడం పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి జిల్లాలోని తెలుగుదేశం సానుభూతిపరులు పార్టీలో ఉన్న సభ్యులు అందరూ టిఆర్ఎస్ నేతలు రాజకీయానికి అతీతంగా చంద్రబాబు కోసం తమకు అండగా నిలిచారని భావిస్తున్నారు. ఇందుకు పువ్వాడ కుటుంబంతో చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుబంధం కూడా కారణమై ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం శ్రేణులకు సంఘీభావంగా రాజకీయాలకు అతీతంగా పువ్వాడ అజయ్ కుమార్ నిలిచారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు అరెస్టుపై అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

About the author

Mohiddin Shaik

Leave a Comment