మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం హైదరాబాదులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. టిఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు శనివారమే ఆ పార్టీకి రాజీనామా చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే రోజు సాయంత్రం సోనియా గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ మరింత బలపడిందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్ ఆశిస్తుండగా అధిష్టాన వర్గం మాత్రం ఆయనను ఖమ్మం నుంచి పోటీ చేయాలని గుర్తుకు చేస్తున్నట్లు తుమ్మల వర్గీయులు కొందరు పేర్కొంటున్నారు. ఖమ్మంలో వీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలో ఉంటున్నారు ఆయనపై పోటీ చేసేందుకు దీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ ఇప్పటివరకు వేచి చూసింది. మంత్రి పై వచ్చాను నిలబెట్టి గెలిపిస్తామని గతంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పైకి కాంగ్రెస్ గంభీరంగా అటువంటి మాటలు మాట్లాడినప్పటికీ అసలు వాస్తవ పరిస్థితులను పరిశీలించినప్పుడు మంత్రి అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గం లో మంచి పట్టు కలిగి ఉన్నారు.
….ఖమ్మం పై పట్టు బిగించిన మంత్రి పువ్వాడ..

నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పనిచేసి అభివృద్ధి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా ఆయన నిత్యం కృషి చేస్తూ ఖమ్మం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దే పనిలో ఆయన చాలావరకు విజయం సాధించారని అభిప్రాయాలు ఉన్నాయి. మున్నేరు ముప్పు నుండి కాపాడటానికి శాశ్వతంగా రక్షణ కూడా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించడంతో పాటు ఖమ్మం నగర సుందరీకరణలో మంచి ఫలితాలు సాధించారని పేరు ఉంది .దాంతో పాటు ఐటీ ఉద్యోగుల కోసం ఐటి , హబ్ నిర్మాణంతో పాటు జిల్లాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ,నర్సింగ్ కాలేజీ తీసుకు రావడం, ఈ ప్రాంత నిరుద్యోగుల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల్లో, సంతోషం కలిగించే అంశంగా చెప్పవచ్చు. వాటితోపాటు గొల్లపాడు ఛానల్ మురుగు కాలువను పూర్తిగా మార్చివేసి ఖమ్మం నగరంలో దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర ఉన్న గొల్లపాడు ఛానల్ మురుగు కాలువను ఉద్యానవనాలుగా మార్చిన ఘనత కూడా మంత్రి అజయ్ కుమార్ దే. లకారం ట్యాంక్ బండ్ తో పాటు పాటుగా గరంలోని రోడ్ల అభివృద్ధి, కొత్త కలెక్టరేట్, కొత్త ఆర్టీసీ బస్టాండ్ , నూతనంగా నిర్మించిన కార్పొరేషన్ భవనం, ఇలాంటివి అనేకం ఆయన గెలుపుకు ఉపయోగపడతాయని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. ఇటువంటి తరుణంలో మంత్రి అజయ్ కుమార్ ను ఓడించేందుకు దీటైన అభ్యర్థి కావాలని కాంగ్రెస్ సహజంగానే ఎదురు చూసింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనను మంత్రి అజయ్ కుమార్ పై పోటీకి నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2009లో తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలిపోయాయి. ఒకపక్క స్వతంత్ర అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా యూనస్ సుల్తాన్ పోటీ చేశారు . దాంతో ఆ పార్టీ ఓట్లు భారీగా చీలుకోవడంతో తుమ్మల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. కాగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పని పరిస్థితుల్లో తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. తుమ్మల స్వతహాగా పాలేరు నియోజకవర్గం కోసమే పట్టుపడుతున్నారు. ఇప్పటికి ఆయన పాలేరు నుంచే తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారో వేచి చూడాల్సిందే.
