మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .. ఎమ్మెల్యేగా తాను ఉండగా తాను పంపిన జాబితాను కాకుండా మాజీ శాసనసభ్యుడు జాబితాలోని పేర్లకు ఎండార్స్ చేసి మంజూరు చేయించారని రాములు నాయక్ ఆరోపించారు. ఈ చర్య కచ్చితంగా తనకు , మదన్ లాల్ కు మధ్య మంట పెట్టటమేనని , అలా మంట పెట్టి మంత్రి చలికాచుకోవడానికి చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన, అన్నారు . ముఖ్య కార్యకర్తల సమావేశంలో వేదికపై నుండి బహిరంగంగా రాములు నాయక్ మంత్రిపై ఘాటు ,విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేగా తనకున్న అధికారాలను తాను నిర్వర్తించకుండా అడ్డు తగిలే ప్రయత్నాలు మానుకోవాలని లేకపోతే ఫలితం అనుభవిస్తారంటూ కూడా ఆయన హెచ్చరికలు చేశారు. శుక్రవారం వైరాలో జరిగిన ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం బి ఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి అజయ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ రాములు నాయక్ చేసిన హాట్ కామెంట్స్ ఆ పార్టీ జిల్లా నాయకులలోనే కాక రాష్ట్ర పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

… ఎమ్మెల్యే పంపిన జాబితా ఎందుకు ఎంపిక కాలేదు…
ఎమ్మెల్యే రాములు నాయక్ పంపించిన జాబితాలోని పేర్లు పూర్తి స్థాయిలో ఎందుకు ఎంపిక కాలేదనే అంశంపై పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. దళిత బంధు ఇప్పిస్తామంటూ రాములు నాయక్ అనుచరులు కొందరు కొంతమంది లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకపక్క రాములు నాయక్ సభ లో మాట్లాడుతూ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగానే ఏనుకూరు మండలానికి చెందిన కొంతమంది దళిత బంధు లబ్ధిదారులు సభ ప్రాంగణం వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని కొంతమంది మీడియా ప్రతినిధులు విషయం ఏమిటని అడగగా తమ వద్ద దళిత బంధు కోసం డబ్బులు వసూలు చేశారంటూ చెప్పారు..
…. దళిత బంధు కోసం రెండు లక్షలు వసూలు చేశారు…

ఏన్కూరు మండలానికి చెందిన ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టు నెలలో దళిత బంధు డబ్బు ఇప్పిస్తామని చెప్పి ఎమ్మెల్యే రాములు నాయక్ అనుచరులు తన వద్ద రెండు లక్షల రూపాయలు తీసుకున్నారని దళిత బంధు కింద తనకు డబ్బు మంజూరు కాలేదని పేర్కొన్నాడు. తిమ్మారావుపేట గ్రామంలో ఒకే ఇంట్లో ఇద్దరికీ దళిత బంధు కింద డబ్బు ఇప్పించారని డబ్బు తీసుకొని ఇష్టం వచ్చిన వారికి ఇప్పిస్తున్నారని బహిరంగంగా మీడియా ముందు ఆరోపించాడు
…. సభ జరుగుతుండగానే లేచి వెళ్లిపోయిన నాయకులు…
ఇదిలా ఉంటే సభ జరుగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాములు నాయక్ మంత్రి అజయ్ కుమార్ పై దూషణలపర్వం కొనసాగిస్తుండగానే వేదికపై ఉన్న కొంతమంది టిఆర్ఎస్ నాయకులు లేచి వెళ్లిపోయారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే ఆ తరువాత వారికి ఫోన్ చేసి తాను సభలో మాట్లాడుతుండగానే వెళ్లిపోవడం సమంజసం కాదని అది తనను అవమానించటమేనని నిలదీసినట్లు ఆ నాయకులు పేర్కొన్నారు. అలా వెళ్లిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, దిశా కమిటీ సభ్యులు కట్ట కృష్ణార్జునురావు ఉన్నారు. మంత్రి అజయ్ కుమార్ పట్ల ఇష్టాను రీతిగా విమర్శలు చేయడాన్ని వింటూ తాము వేదికపై కూర్చోలేకపోయామని అందుకే బయటకు వెళ్లిపోయామని వారు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా వెళ్ళిపోవటం సభ మర్యాద కాదని తెలిసిన వెళ్లాల్సి వచ్చినందుకు కూడా ఇబ్బంది పడ్డామని ఆ తర్వాత ఎమ్మెల్యే తమను నిలదీసినప్పుడు ఏమి చెప్పలేక మౌనం వహించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ తాజా పరిణామాలతో తాము నలిగిపోతున్నామని ఈ అంశంపై వెంటనే జిల్లా నాయకత్వం గానీ మంత్రి గానీ కలగజేసుకొని సమన్వయ పరిచి సర్దుబాటు చేస్తే బాగుంటుందని వారు పేర్కొన్నారు… మొత్తం మీద వైరా ఎమ్మెల్యే నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం రాష్ట్రస్థాయి బి ఆర్ ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
